: మెగాభిమానుల మధ్య చీలిక... దిద్దుబాటు చర్యలు చేపట్టిన పవన్ కల్యాణ్
మెగాభిమానుల మధ్య వచ్చిన చీలికను చక్కదిద్దేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నడుం బిగించాడు. గతవారం తిరుపతిలో జరిగిన చిరంజీవి అభిమాన సంఘాల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులెవరికీ పిలుపు రాకపోవడంతో...వారు దానిని అవమానకరంగా భావించి... విజయవాడలో కాని రాజమండ్రిలో కాని ఒక ప్రత్యేక సమావేశాన్ని ఈ నెలాఖరులో ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలను స్థాపించాలన్న ఆలోచనతో ఈ సమావేశాన్ని పవన్ అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే, మెగా అభిమానులు విడిపోవడం ఏమాత్రం ఇష్టం లేని పవన్ దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలు చేపట్టాడని పవన్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మెగా అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోవడంపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని సమాచారం. తనకు...తన అన్న చిరంజీవికి మధ్య రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ... దానివల్ల మెగా అభిమానులు విడిపోవాల్సిన అవసరం లేదని పవన్ తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అదే విధంగా, తన పేరు మీద రాష్ట్ర స్థాయిలో 'పవన్ యువసేన' అనే పేరుతో ప్రత్యేకంగా సంఘాలను ఏర్పాటు చేయవద్దని... అలాంటి సంఘాలకు తన మద్దతు ఉండదని.... ఈ ప్రయత్నాలు చేస్తోన్న అభిమానులకి ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. చిన్న చిన్న గొడవలు, అవమానాలు ఎదురైనా సర్దుకుపోవాలని... అంతేకానీ ప్రత్యేకంగా తనపేరు మీద అభిమాన సంఘాలు పెట్టాలన్న ఆలోచన విరమించుకోవాలని పవన్ తన అభిమానులకు సూచించినట్టు సమాచారం.