: న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని భయపెడుతున్న ఆత్మలు!
సాక్ష్యం ఉంటే కానీ నమ్మని న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని దెయ్యాలు భయపెడుతున్నాయి. చీకటి పడితే చాలు, అకస్మాత్తుగా కంప్యూటర్లు ఆన్ కావడం, గదుల్లో బుడగలు ఎగురుతూ కనిపించడం, తెల్లని నీడ కాంపౌండ్‌లో తిరగడం చూసి తూర్పు ఢిల్లీలోని కాడ్కడ్‌దూమా కోర్టు సిబ్బంది, న్యాయవాదులు ఠారెత్తిపోతున్నారు. కోర్టు ప్రాంగణంలో దెయ్యాలు, భూతాలు తిరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లని ఆకారం న్యాయస్థానం ప్రాంగణంలో రోజూ తిరుగుతోందని వారు చెప్పిన మాటలను అక్కడి సీసీటీవీ కెమెరా దృశ్యాలు బలపరుస్తున్నాయి. దెయ్యాల పుకార్లలో వాస్తవాలు వెలికి తీసేందుకు పది అంతస్తుల కాడ్కడ్‌దూమా కోర్టు ప్రాంగణంలో లైబ్రరీ, బార్ కార్యాలయంతో పాటు పలు చోట్ల 8 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉదయం నాలుగు కంప్యూటర్లు స్విచ్ ఆన్ అయివుండడం చూసిన సిబ్బంది, సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించగా, ముందు రోజు రాత్రి 11.35 నిమిషాలకు ఒక తెల్లటి నీడ గోడల్లోంచి వచ్చి కంప్యూటర్ల స్విచ్‌లను వేయడం రికార్డు అయ్యింది. ఇంకోసారి లైబ్రరీలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బుడగలు ఎగురుతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వీటికి బలం చేకూరుస్తూ తన చాంబర్‌లోనే ఒక భూతాన్ని చూశానని బార్ కౌన్సిల్ సంయుక్త కార్యదర్శి శర్మ తెలిపారు. ఈ కోర్టులో పనిచేసిన ఒక న్యాయవాది, అతడి కుటుంబం గత యేడాది ఉత్తరాఖండ్ వరదల్లో మృతి చెందారని, అలాగే కొన్ని వారాల కిందట ప్రాంగణంలో కరెంటు పనిచేస్తూ ఒక ఎలక్ట్రీషియన్ మృతి చెందాడని, వారి ఆత్మలే ప్రస్తుతం కోర్టు ప్రాంగణంలో తిరుగాడుతున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. వాటిని పలువురు ధృవీకరిస్తున్నారు. టీ తాగుతున్నప్పుడు ఒక ఆత్మ తమ పక్కనే వచ్చి కూర్చుందని కొందరు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే, న్యాయవాదులు భయపడుతున్నట్టు న్యాయస్థానం ప్రాంగణంలో దెయ్యాలు, భూతాలు, ఆత్మలు లేవని, సెల్ఫ్ ప్రోగ్రామింగ్ వల్ల కంప్యూటర్లు వాటికవే స్విచ్ ఆన్ అయ్యాయని, కంటికి కనిపించని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి వల్ల బుడగలు ఏర్పడ్డాయని దర్యాప్తులో తేలిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.