: 2జీ అక్రమాలు మన్మోహన్ కు తెలిసే జరిగాయి: మాజీ 'కాగ్' వినోద్ రాయ్
దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్ప్రెక్టం అక్రమాలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలిసే జరిగాయని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ వెల్లడించారు. నాటి యూపీఏ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు గుప్పించిన వినోద్ రాయ్, తాజాగా మన్మోహన్ సింగ్ పై నేరుగా ఆరోపణలు సంధించారు. ‘నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్’ పేరిట ఆయన రాసిన పుస్తకం మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ పుస్తకంలో రాయ్, నాటి యూపీఏ అక్రమాలు, వాటిపై ఉన్నతాధికారులు హెచ్చరించినా స్పందించని ప్రధాని మన్మోహన్ సింగ్ తీరుపై విపులంగా వివరించినట్లు సమాచారం. మన్మోహన్ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శనాస్త్రాలు సంధించిన రాయ్, తాజాగా తన ఆరోపణలకు సాక్ష్యంగా మన్మోహన్ పై ఆరోపణలకు యూపీఏలో కీలక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన కమల్ నాథ్ ను చూపారు. నాటి టెలికాం మంత్రి రాజా, తాను చేసిన ప్రతి పనిని ప్రధానికి వివరించిన తర్వాతే చేశారని కూడా రాయ్ వెల్లడించారు. కమల్ నాథ్ తో ప్రధానికి పరిస్థితిని వివరించినప్పటికీ, ప్రధాని అక్రమాలు కొనసాగించేందుకే మొగ్గుచూపారు తప్పించి, వాటిని అడ్డుకునే యత్నం చేయలేదని రాయ్ తెలిపారు.