: దానం నాగేందర్ పై కేసు
మాజీ మంత్రి దానం నాగేందర్ పై కేసు నమోదైంది. ఒకప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ అగ్రనాయకుడు కొండపల్లి సీతారామయ్య మరదలైన కొండపల్లి హైమావతికి చెందిన భూమి కబ్జా విషయంలో ఓ వ్యక్తిని బెదిరించారంటూ దానం నాగేందర్ తో పాటు కార్పొరేటర్ మహేష్ యాదవ్, సూరి, హేమా చౌదరిపై కేసు నమోదైంది. ఏపీ డైయిరీ మాజీ ఛైర్మన్ చంద్రమౌళి రెడ్డి భార్య అయిన కొండపల్లి హైమావతి బంజారాహిల్స్ ప్రాంతంలో 889 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు. అమెరికా నుంచి వచ్చిన ఆమె అల్లుడు జయేందర్ రెడ్డి తమ స్థలంలో నిర్మాణం మొదలు పెట్టారు. ఈ భూమి హేమా చౌదరిది అంటూ కొంత మంది వచ్చి తమ నిర్మాణ పనులు ఆపేసి, సైన్ బోర్డులను ధ్వంసం చేశారని జయేందర్ రెడ్డి తెలిపారు. ఇంకా ఏవైనా ఉంటే దానం నాగేందర్ తో మాట్లాడుకోవాలని చెప్పారు. దీంతో వారు అతనిని కలిసేందుకు ప్రయత్నించగా, పనులు ఆపకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఆయన హైదరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు.