: ముంబై సర్వసన్నద్ధం! ఇక, విశాఖ, చెన్నై నగరాలే వారి టార్గెట్
26/11 తరహా దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టు అర్ధమవుతోంది. తీర ప్రాంతంలో ఉన్న మెట్రో నగరాలపై తీవ్రవాదులు కన్నేసినట్టు నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. తమ ప్రాబల్యాన్ని నిరూపించుకునేందుకు... ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు తీవ్రవాదులు దాడులకు సన్నాహాలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. మరోసారి దాడులు జరిగితే ఎదుర్కొనేందుకు ముంబై సర్వసన్నద్ధంగా ఉండడంతో ఈసారి ఉగ్రవాదుల చూపు దక్షిణాది రాష్ట్రాల్లోని తీర ప్రాంత నగరాలపై పడినట్టు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ముంబై తరువాత స్థానాల్లో మెట్రోనగరాలుగా వినుతికెక్కిన చెన్నై, విశాఖ నగరాలపై వారి కన్నుపడినట్టు చెబుతున్నారు. దానిని ధ్రువీకరిస్తూ విశాఖ, చెన్నైలకు చెందిన విలువైన సమాచారం అందజేస్తున్న ఓ వ్యక్తిని చెన్నైలో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. అరుణ్ సెల్వరాజన్ అనే శ్రీలంక తమిళుడు చెన్నైలోని కీలక భద్రతా సంస్థల వీడియోలు, ఫోటోలు, నేషనల్ సెక్యూరిటీ గార్డుల కేంద్రం, ఆర్మీ అధికారుల శిక్షణ అకాడమీ, కోస్ట్ గార్డు లాంటి కీలక కేంద్రాల వివరాలు పాక్ హ్యాండ్లర్ కు ఇచ్చాడు. చెన్నైలో ఈ మధ్యే ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను నెలకొల్పి దాని పేరిట ఈ ప్రాంతాలకు వెళ్లాడు. గతంలో డేవిడ్ హేడ్లీ కూడా అలాగే ఇమ్మిగ్రేషన్ సంస్థ పేరిట వచ్చి ఆయా ప్రాంతాల వీడియోలు తీసి లష్కరే తోయిబాకు అందజేశాడు. ఇప్పుడు అరుణ్ తప్పుడు వీసాతో వచ్చి చెన్నై, విశాఖల్లో వ్యవహారాలు చక్కబెట్టాడు. ఇతను తాను సేకరించిన సమాచారాన్ని తన మెయిల్ అకౌంట్ ఫోల్డర్లలో సేవ్ చేసి ఉంచి మెయిల్ పాస్ వర్డ్ వారికి చెప్పేవాడు. వారు పాస్ వర్డ్ తో మెయిల్ ఓపెన్ చేసి ఆ వివరాలు డౌన్ లోడ్ చేసుకునేవారు. అయితే కోస్టు గార్డ్ ప్రధాన కేంద్రమైన విశాఖపై దాడి చేయాలంటే ఉగ్రవాదులు చాలా ధైర్యం చేయాల్సిందే. గతంలో పాక్ అలాంటి ప్రయత్నమే చేసి భారత కోస్టు గార్డ్ చేతిలో చావుదెబ్బతింది. మూడు వైపులా కొండలు, ఒక వైపు నీరు ఉండే విశాఖను టార్గెట్ చేయడమంటే మాటలు కాదు. మరోవైపు, విశాఖలో కోస్టు గార్డు సర్వసన్నద్ధంగా ఉంటుంది. ఇతర ప్రధాన నగరాలకంటే పటిష్టమైన భద్రత విశాఖ సొంతం. అదీ కాక విశాఖలో బహుళ అంతస్తుల షాపింగ్ మాల్స్ కూడా తక్కువే. సాధారణ మార్కెట్లకే జనాల తాకిడి ఎక్కువ. షాపింగ్ సంస్కృతి పూర్తిగా వంటబట్టలేదు. ఇకపోతే చెన్నై నగరంపై దాడి చేసే ధైర్యం పాక్ ఉగ్రవాదులు చేయగలరా? భాషాభిమానం మెండుగా గల తమిళులకు ఏమాత్రం అనుమానం వచ్చినా ప్రమాదమే. తమిళుల తెగువపై కూడా ఉగ్రవాదులకు సమాచారం ఉండే ఉంటుంది. ప్రభాకరన్, తమిళుల సాయంతోనే శ్రీలంకను ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో చెన్నైపై దాడికి తీవ్రవాదులు యత్నిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.