: 'తొక్కేస్తా, పాతరేస్తా, సెల్యూట్ కొట్టాలే'... ఇదేం భాషరా బాబూ: కేసీఆర్ ను ప్రశ్నించిన వీహెచ్
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ భాష, తీరు ఏమాత్రం మారలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు విమర్శించారు. మీడియానే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిందని... పత్రికలు, చానళ్లు లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇవేమీ రాజా, మహారాజా రోజులు కావని ఆయన అన్నారు. ''అయినా, నీకు ఎందుకు సెల్యూట్ కొట్టాలిరా బాబూ! 'తొక్కేస్తా... పాతరేస్తా... సెల్యూట్ కొట్టాలే'... ఇదేం భాషరా బాబూ.... నీ పద్ధతేం బాగోలేదురా బాబూ'' అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ నిజాం కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక దొరల రాజ్యమా? అని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. కాళోజీ బ్రతికుంటే కేసీఆర్ ను చూసి బాధపడేవాడని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇప్పటికైనా తన తప్పును తెలుసుకుని టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని ఆయన హితవు పలికారు.