: పాపం! గుర్గావ్ అమ్మాయిల 'డ్రెస్ కోడ్' కష్టాలు!


హర్యానాలోని గుర్గావ్ పట్టణంలో ఓ కాలేజీకి చెందిన విద్యార్థినులకు డ్రెస్ కోడ్ కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ కాలేజీలో సాకర్ ఆడే అమ్మాయిలపై ఆంక్షలు విధించారు. జిమ్నాజియంకు సల్వార్ కమీజ్ వేసుకుని వెళ్ళాలని, మోకాళ్ళపైకి ఉండే షార్ట్స్ ధరించరాదని కాలేజీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆ క్రీడాకారిణులు గగ్గోలు పెడుతున్నారు. సల్వార్ కమీజ్ లు వేసుకుని వర్కౌట్లు ఎలా చేస్తామని ఓ విద్యార్థిని వాపోయింది. ప్రిన్సిపాల్ నిర్ణయం తమను ఆగ్రహానికి గురిచేసిందని విద్యార్థినులు మీడియాకు తెలిపారు. దీనిపై వివరణ అడగ్గా, క్యాంపస్ లో డ్రెస్ కోడ్ జారీచేయలేదని, కానీ, సభ్యతగా నడుచుకోవాలని మాత్రమే కోరామని ప్రిన్సిపాల్ ఉషా మాలిక్ తెలిపారు. దేశ సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించాలన్నది తన అభిమతమని ఆమె పేర్కొన్నారు. అసభ్యకరంగా దుస్తులు వేసుకొచ్చిన అమ్మాయిలు క్యాంపస్ వెలుపల టీజింగ్ కు గురైనట్టు కొన్ని దృష్టాంతాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై ఓ విద్యార్థిని మాట్లాడుతూ, భారతీయ దుస్తులు వేసుకుని ట్రెడ్ మిల్ పై కసరత్తులు, స్టేషనరీ సైక్లింగ్ ఎలా చేయగలరని ప్రశ్నించింది. కొందరు విద్యార్థినులు తల్లిదండ్రులు కూడా ప్రిన్సిపాల్ నిర్ణయం సబబు కాదని అంటున్నారు. డ్రెస్ కోడ్ జారీ చేయలేదని ఆమె చెబుతుండడం అవాస్తవమని, షార్ట్స్ వేసుకొచ్చిన విద్యార్థినుల కుటుంబ సభ్యులను పిలిచి మందలించడం వంటి ఘటనలు జరిగాయని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News