: బాపు దర్శకత్వంలో సినిమా నిర్మించాలన్న నా చిరకాల కోరిక నెరవేరలేదు: ఎస్పీబీ


బాపు దర్శకత్వంలో సినిమా నిర్మించాలనేది తన చిరకాల కోరిక అని... అయితే ఆ కోరిక నెరవేరకుండానే భగవంతుడు ఆయనను తీసుకెళ్లిపోయాడని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. బాపుతో 'తెలుగుదనం' నిండిన సినిమా తీయాలని గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నానని... దానికి కథా చర్చలు కూడా జరిగాయని... అయితే ఆయనతో సినిమా తీయాలనే తన కోర్కె మాత్రం నెరవేరలేదని... బాలు బాధ పడ్డారు. బుధవారం ఉదయం విశాఖపట్నంలోని ఏయూ ప్లాటినమ్‌ జూబ్లీ అతిథి గృహంలో నిర్వహించిన బాపు శ్రద్ధాంజలి సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బాపుతో తనకున్న అనుబంధాన్ని ఆయన నెమరువేసుకున్నారు. బాపుకు రక్షణ కవచం రమణేనని, వారిద్దరిదీ విడదీయలేని అపురూప బంధమని అన్నారు. రెండు చేతులతో దీపం ఆరిపోకుండా కాపాడినట్టు, పుష్పం రేకులు రాలిపోకుండా చూసుకున్నట్టుగా బాపును రమణ అతి జాగ్రత్తగా కాపాడుకున్నారన్నారు. గొప్పవాళ్లు తమ గొప్పను చెప్పుకోరని, ఎదుటివాళ్ల గొప్పతనాన్ని గుర్తిస్తారని... బాపు కూడా తన గొప్పతనం కంటే ఎదుటివారి ప్రతిభను, గొప్పదనాన్ని గుర్తించేవారని పలు సందర్భాలలో ఆయనతో జరిగిన సంభాషణలు ఉదహరిస్తూ వివరించారు. బాపుది పసి పిల్లవాడి మనస్తత్వమని... హిపోక్రసీ ఇసుమంతైనా లేని వ్యక్తి అని బాలు తెలిపారు. మాటల్లో సంక్షిప్తత, ఉదాత్త స్వభావం బాపు సొంతమన్నారు. ఆయన దర్శకత్వం వహించిన మూడు చిత్రాలకు తాను సంగీతం అందించానని, అది తనకు లభించిన గొప్ప గౌరవమని అన్నారు. బాపుకు సంగీతమంటే ప్రాణమని, ఎప్పుడు కలిసినా తనతో పాటలు పాడించుకుని ఆనందించేవారని ఆయన తెలిపారు. మంచి సాహిత్యం ఉన్న పాటల కోసం బాపు తన సినిమాల్లో ఎన్నోసార్లు సన్నివేశాలు పెంచిన సందర్భాలు ఉన్నాయని వివరించారు.

  • Loading...

More Telugu News