: బహిరంగంగా పొగతాగితే రూ.20 వేలు ఫైన్


పొగరాయుళ్లకు చెక్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. బడ్జెట్ లో సిగరెట్ల ధర ఓ మాదిరిగా పెంచిన కేంద్రం ధూమపానంపై దృష్టి సారించింది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం, ప్యాక్ తో కాకుండా విడిగా సిగరెట్లు కొనడం, అమ్మడంపై నిషేధం విధించే దిశగా యోచన చేస్తోంది. నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ ఎత్తున జరిమానా విధించడంపై కసరత్తు చేస్తోంది. అలా చేస్తే ధూమపానాన్ని అరికట్టవచ్చని, తద్వారా ప్రజలను రోగాల బారినుంచి కాపాడవచ్చని ఆలోచిస్తోంది. మనదేశంలో సిగరెట్ల అమ్మకాలు ఎక్కువగా లూజ్ గానే జరుగుతాయి. ప్యాకెట్లు కొనుక్కుని తాగేవాళ్లు తక్కువ. ఒకటి అరా కొనుక్కుని అక్కడే బహిరంగంగా తాగేసి వెళ్లిపోతుంటారు. మొత్తం సిగరెట్ల అమ్మకాల వాటాల్లో 70 శాతం ఇలాగే జరుగుతాయని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బహిరంగ ధూమపానంపై 200 రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు జరిమానా విధించే విధానాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. సిగరెట్ తాగేందుకు కనీస వయసును కూడా పెంచేందుకు కేంద్రం ఆలోచన చేస్తోంది. సిగరెట్ ప్యాకెట్ పై ప్రభుత్వం నిర్దేశించిన చట్టబద్ధమైన హెచ్చరిక కనిపించకపోతే కేవలం 5 వేల రూపాయలనే జరిమానాగా విధించేవారు. ఈ జరిమానాను 50 వేల రూపాయలకు పెంచేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ చొరవతో కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం.

  • Loading...

More Telugu News