: ఆ ముఖ్యమంత్రికి కోపం వచ్చింది!
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు విలయం సృష్టిస్తుండగా, సర్కారు తగిన విధంగా స్పందించడం లేదని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై ఒమర్ వ్యాఖ్యానిస్తూ, "వర్షాన్ని నేనేమన్నా కురవమని చెప్పానా... నేను ఆపడానికి? నేనే గనుక వర్షాన్ని తెచ్చి ఉంటే, తప్పక ఆపేవాడిని" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు ఈ విషయంలో ఏమైనా మెరుగైన చర్యలు తీసుకోగలిగితే, వారు చెప్పింది వినడానికి తాను సిద్ధమేనని అన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని, ఈ విషయాన్ని వారు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని ఒమర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి 'సీరియస్'గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.