: భద్రపుర వెళ్ళి 'కాఫీ' అని అడగొద్దు... షాక్ తింటారు!
బెంగళూరు నగర శివారులో ఉన్న భద్రపుర గ్రామానికి వెళ్ళి 'కాఫీ కావాలి' అని అడిగి చూడండి! తప్పక షాక్ తింటారు! అలా అని ఇంగ్లీషు రాదా? అంటే, వచ్చు అని సమాధానమొస్తుంది! కాఫీ అని అడిగితే, ఓ వ్యక్తి వచ్చి "నా పేరే కాఫీ... నాతో పనేంటి?" అంటాడు. దీంతో, నోళ్ళు వెళ్ళబెట్టడం అడిగిన వాళ్ళ వంతవుతుంది. ఎందుకంటే, ఆ ఊరి జనాల పేర్లన్నీ విచిత్రంగా ఉంటాయి. కాఫీ, ఇంగ్లీష్, హైకోర్టు, రాజ్ కపూర్, శశి కపూర్... ఇలాగన్నమాట. అంతేకాదండోయ్..! కాంగ్రెస్, జనతా అనే పేర్లు ఇక్కడ పలుకుబడిలో ఉన్నాయి. ఈ గ్రామంలో నివసించేవారిలో అత్యధికులు 'హక్కి పక్కి' సంచార తెగకు చెందినవాళ్ళే. వారే ఇలాంటి అసాధారణమైన పేర్లను పెట్టుకుంటారు. పరిసరాలు, రోజువారీ ఎదురయ్యే వస్తువులు, పరిస్థితులు, వారు చూసిన సినిమాలు, తినే తిండి... ఇలా, 'కాదేదీ నామకరణానికి అనర్హం' అన్న రీతిలో ఈ తెగ వారు తమ పిల్లలకు పేర్లు పెట్టేసుకుంటారట.