: మోడీ కోసం ఒబామా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు!


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 29, 30 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. నరేంద్రమోడీ రాక కోసం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ దేశాధ్యక్షుడికి గానీ, ప్రధానమంత్రికి గానీ ఇవ్వని ప్రాధాన్యతను నరేంద్రమోడీ పర్యటనకు అమెరికా ఇస్తోంది. గతంలో గుజరాత్ అల్లర్లను కారణంగా చూపి మోడీకి వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికా... ప్రస్తుతం ప్రధాని పీఠం ఎక్కిన మోడీకి అమిత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఆసక్తికర కారణాలున్నాయి. ఒకవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ప్రాధాన్యత క్రమంగా తగ్గుతుండగా, మరోవైపు చైనా ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. దీంతో పాటు ప్రపంచదేశాలకు 'పెద్దన్న'లాగా వ్యవహరిస్తూ... సూపర్ పవర్ గా ఆజమాయిషీ చేస్తోన్న అమెరికాకు పోటీ ఇచ్చే స్థాయిలో చైనా ఎదుగుతుండడం ఒబామాకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో, వ్యూహాత్మక భాగస్వామిగా ఆసియా ఖండంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మరో అగ్రదేశమైన భారత్‌తో స్నేహ హస్తానికి అమెరికా అర్రులు చాస్తోంది. దీంతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ ను తన వైపు తిప్పుకునేందుకు కూడా మోడీ పర్యటనను అవకాశంగా మలుచుకోవాలని అమెరికా భావిస్తోంది. మోడీ పర్యటనలో అంతర్జాతీయ రాజకీయాలతో పాటు భారత్ సమీప దేశాలైన ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా దేశాల్లో జరుగుతున్న పరిణామాలపై ఇరుదేశాలు ఏకాభిప్రాయంతో వ్యవహరించే దిశగా చర్చలు జరగనున్నాయి. ఈ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మోడీ ప్రధానిగా ఎన్నికైన వెంటనే ఒబామా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీ, రక్షణ మంత్రి చక్‌ హెగెల్‌లు భారత్‌కు ప్రత్యేకంగా వచ్చి మరీ మోడీని కలిసి వెళ్లారు. అమెరికా పర్యటన సందర్భంగా మోడీ సెప్టెంబర్‌ 29, 30 తేదీల్లో వైట్‌ హౌస్‌లో ఒబామాతో సమావేశమవుతారని వైట్‌ హస్‌ ప్రతినిధులు వెల్లడించారు. ఒక విదేశీ నేత వరుసగా రెండు రోజుల పాటు అమెరికా అధ్యక్షునితో వైట్‌హౌస్‌లో సమావేశం కావడం అత్యంత అరుదైన విషయం. దీనిని బట్టి మోడీ పర్యటనకు ఒబామా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోంది. భారత్-అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో చర్చలు ఉంటాయని వైట్‌ హౌస్‌ చెబుతోంది. ఈ భేటీలో ఇరుదేశాల ఆర్థికాభివృద్ధి, రక్షణ ఒప్పందాలు, రెండు దేశాలకూ దీర్ఘకాలిక లాభం చేకూర్చే అంశాలపై చర్చిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News