: పదవి చేపట్టాలని కాదు... బీజేపీని ఆపాలనే: కేజ్రీవాల్
ఢిల్లీ గద్దెపై మరోసారి కూర్చోవాలనే కాంక్షతో లేనని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అవినీతిని అంతం చేస్తామంటూ కేంద్రంలో కూర్చున్న బీజేపీ అసలు రంగును ప్రజలకు బహిర్గతం చేయడమే లక్ష్యమని అన్నారు. అధికారంలో కూర్చునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజల ముందుంచడమే తాను చేస్తున్న పని అని ఆయన తెలిపారు. తన ముందున్న లక్ష్యం బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా చూడడమేనని ఆయన తెలిపారు. అందుకోసం తాను ఎవరితోనైనా జట్టుకట్టేందుకు సిద్ధమని అన్నారు. అయితే తాను జట్టుకడతాను అనే దానిని అధికారం చేపట్టేందుకు అనే కోణంలో చూడవద్దని ఆయన కోరారు. ఇప్పటికిప్పుడు ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.