: హరీష్ రావు సవాల్ కు రమణ జవాబు
మెదక్ స్థానాన్ని గెలుచుకోకపోతే టీడీపీ నేత ఎర్రబెల్లి రాజకీయ సన్యాసం చేస్తారా? అంటూ మంత్రి హరీష్ రావు కొత్తగా సవాల్ విసరడంపై తెలంగాణ టీడీపీ నేత ఎల్ రమణ మండిపడ్డారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ, హరీష్ రావు కొత్తగా సవాలు విసరడానికి ముందు గత సవాళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇస్తే టీడీపీ ఆఫీస్ లో అటెండర్ ఉద్యోగం చేస్తానని సవాలు విసిరారని ఆయన గుర్తుచేశారు. టీడీపీ లేఖ ఇచ్చిన తరువాతే రాష్ట్ర విభజన జరిగిందని గుర్తు చేసిన ఆయన, దాని సంగతేంటని ఆయన ప్రశ్నించారు. చేతకాని సవాళ్లు విసిరే ముందు హరీష్ రావు ఆలోచించి మాట్లాడాలని ఆయన సూచించారు.