: అలాంటప్పుడు సినీ తారలు ఎలా ఆదర్శమవుతారు?


దేశానికి సేవ చేసిన మహనీయుల గురించి నేటి యువతకు తెలిసినా తెలియకున్నా, సినీ నటుల గురించి మాత్రం పూర్తిగా తెలుస్తుంది. సినీ నటులు ఏ చీర కడతారు? ఏ డ్రెస్ వేసుకుంటారు? ఎలాంటి మేకప్ వాడుతారు? ఏ మోడల్ చెప్పులు ధరిస్తారు?... ఇలా ప్రతి విషయంలో యువత ఫాలో అయ్యేది సినీ నటులనే. చాలా సందర్భాల్లో... వారిలా వస్త్రధారణ, నగలు వేసుకోవడంతోనే ఆగకుండా, వారిని అనుకరిస్తూ తమ ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా యువతకు రోల్ మోడళ్ళుగా నిలుస్తున్న సినీ తారలు వ్యభిచారకూపంలో చిక్కుకుంటున్నారు. గతంలో ఒకరిద్దరు పట్టుబడినా, వ్యవహారం బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా నటీమణులు వ్యభిచారం కేసుల్లో పట్టుబడడం పరిపాటిగా మారింది. దీంతో మరోసారి సినీనటుల వ్యభిచారంపై రాష్ట్రంలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ ధోరణిపై మానసిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కారణాలను సినీ నటులు తరచి చూసుకోవాలని వారు సూచిస్తున్నారు. సమాజంలో వ్యభిచారం గౌరవమైన వృత్తికాదని తెలియని వ్యక్తులు భారతదేశంలో ఉండరంటే అతిశయోక్తికాదు. అది చట్టవ్యతిరేకం కూడాను. మరోపక్క వయసుడిగిపోయి, కాటికి కాళ్లు చాచే వయసులో కూడా కష్టించి పని చేసే వృద్ధులు నిత్యం తారసపడుతుంటారు. అయినా సరే యువ నటీమణులు వ్యభిచారం రొంపిలోకి దిగడానికి కారణాలు ఏమిటి? అని సామాజికవేత్తలు ఆరాతీస్తున్నారు. సినిమాల్లోకి వచ్చిన తరువాత అవకాశాలు దక్కకపోతే డబ్బు సంపాదనకు వ్యభిచారమే మార్గమా? అని ప్రశ్నిస్తున్నారు. సినీ నటులుగా మారిన తరువాత పరిచయాలు పెరుగుతాయి, విలాసాలు పెరుగుతాయి... అవి లేకపోతే జీవితం లేదా? అని మానసిక శాస్త్రవేత్తలు అడుగుతున్నారు. వీరిని వ్యభిచారం రొంపిలోకి లాగేది నైతిక విలువల పతనమా? లేక మానసిక దౌర్భల్యమా? అని పరిశోధిస్తున్నారు. టీవీలు, సినిమాల ప్రభావంతో నటన అంటే విపరీతమైన మోజు పెంచుకుని, అదే లోకమన్న భ్రమలో యువత పడిపోతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో రకాల భ్రమలతో సినీ రంగంలోకి వచ్చేవారు గౌరవంగా జీవించడానికి పలు మార్గాలున్నాయన్న విషయాన్ని గుర్తించేలా చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే కాకుండా, నైతిక విలువలు పతనమవ్వకుండా, మానసిక స్థితి దిగజారకుండా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరముందని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సినీనటులు వ్యభిచారంలో దొరికిపోతుంటే దాని ప్రభావం సమాజంపై పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువతరం వారి మార్గాన్ని ఎన్నుకునే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News