: 24 గంటల్లో ఏపీ, తెలంగాణల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం మధ్యప్రదేశ్, మహారాష్ట్రల వైపు తరలి వెళ్లిందని... దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం పెద్దగా ఉండదని ప్రకటించింది. రాయలసీమలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.