: ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ... ఆర్టీసీ డ్రైవర్ సజీవదహనం
హైదరాబాద్ బోయిన్ పల్లి వద్ద ఘోరం సంభవించింది. నెల్లూరు జిల్లా ఇంజమూరు నుంచి ఆర్మూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యానును ఢీకొంది. దీంతో, బస్సులో వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గంగాధర్ సజీవదహనమయ్యారు. మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. డీజిల్ ట్యాంకు రాపిడికి గురవటం వల్లే మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 57 మంది ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గురవగానే ప్రయాణికులందరూ బస్సు దిగేశారు. డ్రైవర్ తొడ ఇరుక్కుపోవడంతో... ఆయన మాత్రం బస్సు దిగలేకపోయారు. దీంతో, ఆయన అగ్నికి ఆహుతి అయ్యారు. డీసీఎం డ్రైవర్ పరారయ్యాడు.