: అలా జరుగుతుందనుకోలేదు...మీరిలా చేయండి: అమితాబ్
మన ఆప్తులకు, దగ్గరివాళ్లకు ఏదయినా చెప్పాలనిపిస్తే చెప్పేయండి, క్షమించమని, లేదా ప్రేమిస్తున్నామని, శుభాకాంక్షలని ఇలా ఏదయినా చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పేయండని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సూచించారు. పుట్టిన రోజు వేడుకలకు హాజరవడం, పెళ్లిరోజున వారిని పలకరించి ఆశ్చర్యపరచడం వారికి ఆనందం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అలా చేయకపోయినా పర్లేదు కానీ, అంతిమ ఘడియల్లో మాత్రం చూడడానికి వెళ్లాలని ఆయన సూచించారు. జీవితం క్షణభంగురమని, ఎప్పుడు, ఏం జరుగుతుందో మనం ఊహించలేమని ఆయన అన్నారు. అమితాబ్ ఆఫీసులో గత 30 ఏళ్లుగా ఓ వ్యక్తి పని చేస్తున్నారు. ఈ మధ్య ఆయన, పని ఉంది వారం రోజులు లీవ్ కావాలని అడిగారు. అమితాబ్ లీవ్ ఇచ్చారు. అయితే ఊరెళ్లిన ఆయన గుండెపోటు రావడంతో అక్కడే మృతి చెందారు. దీంతో అమితాబ్ తీవ్రంగా కలత చెందారు. ఆరోగ్యంగా ఉన్న ఆయన, ఇంత త్వరగా మరణించడాన్ని తాను జీర్ణించుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. అతని చేతులపైనే అభిషేక్, శ్వేత పెరిగారని, అతనిని వారిద్దరూ అంకుల్ అంకుల్ అంటూ పిలిచేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. మరణం తప్పదని తెలిసినా... ఎవరైనా ఆప్తులు మరణిస్తే అంతిమయాత్రకు వెళ్లాలని ఆయన అభిమానులకు సూచించారు. అవే అవతలి వ్యక్తిని మనం చూసే చివరి క్షణాలని, ఆ తరువాత అతనిని చూడాలనుకున్నా కుదరదని ఆయన అభిప్రాయపడ్డారు.