: నిమజ్జనాన్ని పరిశీలించేందుకు హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే... భారీ భద్రత
వినాయకుడి నిమజ్జనం రోజున జంటనగరాల ప్రధాన రహదారులు జనసంద్రాన్ని తలపిస్తాయి. వేలాది గణనాథులు, లక్షలాది మంది భక్తులు, వేలాది వాహనాలు, హోరెత్తించే డప్పులు,... ఇలా నగరం మొత్తం భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంది. ఈ కోలాహలంలో సంఘవిద్రోహ శక్తులు దుశ్చర్యలకు పాల్పడే అవకాశాలు అనేకం ఉంటాయి. ఆల్ ఖైదా, ఇండియన్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద సంస్థలు దేశంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఇంటలిజెన్స్ నివేదిక కూడా ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో, పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. దాదాపు 40 వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిఘాను పెంచారు. దారి పొడవునా సీసీ కెమెరాలు కన్నేసి ఉంచాయి. 30 బాంబు నిర్వీర్య దళాలు రంగంలోకి దిగాయి. వీటన్నిటికి తోడు, గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేయనున్నామని డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఈ ఏరియల్ సర్వేలో హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా పాల్గొంటారు.