: మహా నిమజ్జనం నేడే... సర్వం సన్నద్ధం
11 రోజులుగా విశేష పూజలందుకున్న వినాయకుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో నిమజ్జన కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం నుంచి ప్రారంభమయ్యే విగ్రహాల నిమజ్జనం రేపు ఉదయం వరకు కొనసాగనుంది. జంటనగరాల్లోని మొత్తం విగ్రహాల్లో 60 శాతం వరకు విగ్రహాలు హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం కానున్నాయి. నిమజ్జన కార్యక్రమాన్ని 15 లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షిస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 25 వేలు, సైబరాబాద్ పరిధిలో 9 వేల విగ్రహాల వరకు ఉన్నట్టు పోలీసుల అంచనా. వీటిలో దాదాపు 25 వేల విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాయి. అలాగే, సరూర్ నగర్ చెరువులో 3 వేలు, దుర్గం చెరువులో 15 వందలు, కూకట్ పల్లి ఐడీఎల్ చెరువులో 2 వేల విగ్రహాల వరకు నిమజ్జనం కానున్నాయని అంచనా. గణనాథుని నిమజ్జనానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు పకడ్బందీగా వ్యూహరచన చేశారు.