: ఆర్టీసీలో సమ్మె తప్పేలా లేదు!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఏపీ రీజియన్ లో సమ్మె తప్పేలా లేదు. ఈ నెల 11 నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన నోటీసుపై అటు యాజమాన్యం కాని, ఇటు ప్రభుత్వం కాని పెద్దగా స్పందించిన దాఖలా కనిపించలేదు. దీంతో ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ లో సమ్మెకు దిగడం ఖాయమేనని ఈయూ నేతలు చెబుతున్నారు. అయితే మంగళవారం కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్చలు ఏ మేరకు సఫలమవుతాయన్న అంశంపై కూడా సందిగ్ధత నెలకొంది. నానాటికీ నష్టాల్లో కూరుకుపోతున్న సంస్థ, నిర్వహణ పేరిట కార్మికులు దాచుకున్న సంక్షేమ నిధి నిధులను వాడటం మొదలుపెట్టడం తాజా పరిస్థితికి దారి తీసింది. ఇప్పటికే సంక్షేమ నిధి నుంచి రూ. 444 కోట్లను యాజమాన్యం వాడింది. మరోవైపు ప్రభుత్వం రూ. 700 కోట్ల మేర బకాయి పడింది. చెల్లించాల్సిన బకాయిలపై నోరు మెదపని ప్రభుత్వం సంక్షేమ నిధిని వాడేందుకు యాజమాన్యానికి ఎలా అనుమతిస్తుందన్నది కార్మిక సంఘాల వాదన. అంతేకాక రూ.250 కోట్ల మేర నిధులను విడుదల చేస్తాం, సర్దుకోండని చెబుతున్న ప్రభుత్వం, నిధుల విడుదలకు మాత్రం మొగ్గు చూపడం లేదు. దీంతో కార్మికులు మరింత అసహనానికి గురయ్యారు. సమ్మెకు దిగితే కాని ప్రభుత్వం దిగి రాదన్న భావనతో వారు ఆ దిశగానే పయనించేదుకు సన్నద్ధమవుతున్నారు. మరి, రేపటి చర్చలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే!

  • Loading...

More Telugu News