: మమతా బెనర్జీని విచారించాల్సిందే: జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విచారించాల్సిందేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కోల్ కతాలో ఆ పార్టీ నిర్వహించిన సభలో ఆదివారం ప్రసంగించిన సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. శారదా చిట్ ఫండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ కునాల్ ఘోష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాలంటే శారదా చిట్ ఫండ్ అధినేత సుదీప్త సేన్ తో పాటు తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా విచారించాల్సి ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. సింగూర్ లో టాటా కంపెనీ ప్రాజెక్టు నేపథ్యంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగిన మమత, 17 లక్షల మందిని ముంచేసిన శారదా స్కాంపై ఎందుకు స్పందించడం లేదని అమిత్ షా ప్రశ్నించారు.