: శంకర్ 'ఐ' ఆడియో లాంచ్ కు వస్తున్నా: ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్
శంకర్-విక్రమ్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఐ' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి తాను వస్తున్నట్టు హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోని మ్యూజిక్ ఇండియా సంస్థ ఓ వీడియోను యూట్యూబ్ లో పెట్టింది. ఆ వీడియోలో ష్వార్జ్ నెగ్గర్ మాట్లాడుతూ, "హలో ఇండియా... 'ఐ' సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్ కు కంగ్రాట్స్ చెబుతున్నాను. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్నాయి. ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయం. ఈ సినిమా ఆడియో వేడుక సెప్టెంబర్ 15న జరగనుంది. అందులో పాల్గొనేందుకు చెన్నై వస్తున్నా" అని పేర్కొన్నారు. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. విక్రమ్ సరసన అమీజాక్సన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది.