: రాజధాని విషయంలో వైసీపీ కోస్తా, సీమ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలు


గురువారం (నిన్న) శాసనసభలో రాజధానిపై చర్చ సందర్భంగా కోస్తా, రాయలసీమ వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలు పొడచూపాయి. గురువారం ఉదయం 11 గంటల వరకు రాజధానిపై చర్చకు పట్టుబడుతూ సభ కార్యక్రమాలను వైసీపీ సభ్యులు స్తంభింపజేశారు. మూడోసారి వాయిదా అనంతరం సభ ప్రారంభమైనప్పుడు కూడా చంద్రబాబును రాజధానిపై ప్రకటన చేయనివ్వకుండా ఉండేందుకు వైసీపీ భారీ వ్యూహంతో వచ్చి ఉంటుందని శాసనసభలో అధికారసభ్యులతో పాటు మీడియా వర్గాలు కూడా భావించాయి. అయితే, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ చంద్రబాబు ప్రసంగానికి పెద్దగా అడ్డు చెప్పకుండానే... ప్రతిపక్ష నాయకుడు జగన్ విజయవాడను రాజధానిగా స్వాగతించారు. రాజధాని విషయంలో వైసీపీ కోస్తా, సీమ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అభిప్రాయభేదాల కారణంగా జగన్ హఠాత్తుగా నిన్న వ్యూహాన్ని మార్చుకున్నారు. వాస్తవానికి నిన్న సభ రెండోసారి వాయిదా అనంతరం... జగన్ సమక్షంలో రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, శాసనసభలో ఆ పార్టీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, సుజయ్ కృష్ణా రంగారావులతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇకముందు కూడా చర్చకు పట్టుబట్టి సభను స్తంభింపచేయాలని రాయలసీమ ఎమ్మెల్యేల తరుపున మైసూరా రెడ్డి సూచించారు. మైసూరా రెడ్డి సూచనకు జగన్ కూడా అంగీకారం తెలిపారు. అయితే, దీన్ని జ్యోతుల నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధాని నగరంపై నివేదికలు తెప్పించామని... విజయవాడ-గుంటూరును రాజధానిగా వ్యతిరేకిస్తే కోస్తాలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన స్పష్టం చేశారు. నెహ్రూ వాదనకు కోస్తా ఎమ్మెల్యేలు ఏకీభవించి చర్చలో పాల్గొనాలన్న నిర్ణయానికి వచ్చారు. సభను స్తంభింపచేయాలన్న తన వాదనకు వైసీపీ కోస్తా ఎమ్మెల్యేలు ఎవరూ ఒప్పుకోకపోవడంతో 'థ్యాంక్యూ' అని చెప్పి మైసూరా బయటికి వెళ్లిపోయారు. ఈ కారణంగా, ఆఖరి నిమిషంలో తన వ్యూహాన్ని మార్చుకుని విజయవాడను రాజధానిగా స్వాగతించేందుకు జగన్ నిర్ణయించుకున్నారు.

  • Loading...

More Telugu News