: పశ్చిమగోదావరి జిల్లా ప్రజల వల్లే నేను ఈరోజు అసెంబ్లీలో నిలబడగలిగాను: అసెంబ్లీలో చంద్రబాబు
ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, పశ్చిమగోదావరి జిల్లా ప్రజల వల్లే తానీ రోజు అసెంబ్లీలో నిలబడగలిగానని ఆయన అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు తనమీద చూపెట్టిన అభిమానాన్ని తాను జీవితాంతం మర్చిపోనని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలుచుకుందని చంద్రబాబు తెలిపారు. వీటితో పాటు మూడు పార్లమెంట్ స్థానాలను కూడా తమ కూటమికే కట్టబెట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సి ఉన్నా... తనమీద ప్రత్యేక అభిమానం చూపెట్టిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజలంటే తనకు ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందని చంద్రబాబు అన్నారు. అందుకే పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని ఆయన పేర్కొన్నారు.