: సెంటర్ ప్లేస్ లో రాజధాని ఉంటుంది, అది ఆపడం జగన్ వల్ల కాదు, జగన్ బాబుతరం కూడా కాదు: అచ్చెన్నాయుడు
యనమల అడ్డదారిలో మంత్రి అయ్యారన్న జ్యోతుల నెహ్రు వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. యనమల అడ్డదారిలో ఎప్పుడూ రాజకీయాలు చేయలేదని... తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో యనమల ఆరుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారని ఆయన అన్నారు. యనమల స్థాయికి జగన్ చేరడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. బయటి నుంచి స్లిప్పులు తెప్పించుకుని, వాటిని చదివి, వైసీపీ సభ్యులు సభలో మాట్లాడటం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల ఆలోచన తెలుసుకుని వైసీపీ మసలుకోవాలని ఆయన సూచించారు. తెలుగువారి మధ్య మళ్లీ చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని మరోసారి రావణకాష్టం చేయాలని వైసీపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. 13 జిల్లాల సెంటర్ ప్లేస్ లోనే రాజధాని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలా కాకుండా చేయడం జగన్ వల్ల కాదని... జగన్ బాబు తరం కూడా కాదని ఆయన ఆవేశంగా అన్నారు. ఫ్యాక్షనిస్ట్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడని... రాష్ట్రం అల్లకల్లోలమయితేనే ఫ్యాక్షనిస్ట్ కు ప్రశాంతత అని... జగన్ ఫ్యాక్షనిస్ట్ కావడం వల్లే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.