: ఇకపై ఉద్యోగార్థులు, పాస్ పోర్టు దరఖాస్తులపై పోలీసుల విచారణకు చెల్లుచీటి
మీరు కొత్తగా సర్కారీ ఉద్యోగానికి ఎంపికయ్యారు, లేదా, పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మీ ఇంటికి పోలీసులొస్తారు. మీ వ్యక్తిగత వివరాలపై ఆరా తీస్తారు. ఇరుగుపొరుగుతో మీ ప్రవర్తన గురించి కూపీ లాగుతారు. సమగ్ర నివేదిక రూపొందిస్తారు. ఇప్పటిదాకా జరుగుతున్న తంతు ఇదే. దీనికోసం కొన్ని సందర్భాల్లో ఈ తంతు సుదీర్ఘంగా నడుస్తోంది. ఇరుగుపొరుగు వారు మీ గురించి ఉద్దేశపూర్వకంగా చేసే ఆరోపణలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలూ లేకపోలేదు. ఇకపై వీటికి కేంద్రం చెల్లుచీటి ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ముసాయిదాను రూపొందించింది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ముసాయిదాకు తుదిరూపు ఇచ్చిన తర్వాత కేంద్రం దీనిపై స్పష్టమైన విధివిధానాలను జారీ చేయనుంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం... కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారిపై ఇకమీదట పోలీసుల విచారణ ఎంతమాత్రం జరగదు. సదరు అభ్యర్థి స్వదస్తూరితో తాను ఉద్యోగంలో చేరే శాఖకు అందజేసే అఫిడవిట్ సరిపోతుంది. అటు, పాస్ పోర్టు దరఖాస్తుదారులు జిల్లా పోలీసు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం రాబోదు. అయితే, స్థానిక పోలీసుల విచారణ లేకుండానే పాస్ పోర్టుల జారీ వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తనున్నాయా..? అన్న కోణంలో కేంద్రం నిశితంగా పరిశీలన చేస్తోంది. ఈ పరిశీలన పూర్తి కాగానే కేంద్రం దీనిపై విధివిధానాలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.