: బెంగాల్ లో దారుణం: తండ్రిపై దాడిని ప్రశ్నించిన బాలికపై హత్యాచారం!


పశ్చిమ బెంగాల్ లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. తండ్రిపై రాజకీయ గూండాలు చేస్తున్న దాడిని ప్రశ్నించిన దళిత బాలికపై అధికార పార్టీకి చెందిన మహిళా రాజకీయ నేత అనుచరులు అత్యాచారం చేసి హత్య చేశారు. అయితే పోలీసులు కూడా అధికార పక్షానికి చెందిన మహిళా రాజకీయ నేతకు అనుకూలంగా వ్యవహరించేందుకు యత్నించడంతో సీీపీఎం రంగంలోకి దిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ విషయం, తీవ్ర ఉద్రిక్తతలకు తెరలేపింది. జాల్పాయిగురి జిల్లా దిప్గురిలో సోమవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దళిత రైతు, భూస్వామికి చెందిన ట్రాక్టర్ సహాయంతో పొలం సాగు చేశాడు. అయితే అందుకైన అద్దె చెల్లింపుల్లో ఇరువర్గాల మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో తృణమూల్ కౌన్సిలర్ నమితా రాయ్ ని భూస్వామి ఆశ్రయించాడు. నమితా రాయ్ పంచాయతీ పెట్టింది. దళిత రైతు కుటుంబాన్ని పంచాయతీ వద్దకు రాయ్ అనుచరులు ఈడ్చుకొచ్చారు. భూస్వామికి నెలలోగా రూ.40 వేలు చెల్లించాలని రాయ్ తీర్పు చెప్పింది. ఆ తీర్పు భావ్యం కాదన్న రైతుపై రాయ్ అనుచరులు మూకుమ్మడిగా పిడిగుద్దులు కురిపించారు. దీంతో అక్కడే ఉన్న రైతు కూతురు, పాఠశాల విద్యార్థిని రాయ్ ను నిలదీసింది. అంతే, ఒక్కసారిగా మృగంగా మారిన రాయ్ నేలపై ఉమ్మేసి, దానిని నాలుకతో నాకమంటూ బాలికను అజ్ఞాపించింది. రైతు తిరగబడ్డాడు. గొడవైంది. ఇరువర్గాలు అక్కడి నుంచి నిష్క్రమించాయి. కొద్ది గంటలకే రాయ్ ని ఎదిరించిన బాలిక అదృశ్యమైంది. మరికొద్ది గంటలకు రైలు పట్టాల పక్కన శవమై తేలింది, అది కూడా నగ్నంగా! బాధిత బాలిక కుటుంబం ఫిర్యాదునందుకున్న పోలీసులు కేసు నమోదు విషయంలో తాత్సారం చేశారు. బాధిత కుటుంబానికి సీపీఎం మద్దతు తోడవడంతో, ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, రాయ్ దంపతులు పరారీలో ఉన్నారు. అత్యాచారం జరిగిన దాఖలా కనిపించడం లేదన్న పోలీసుల వ్యాఖ్యలపై సీపీఎం నేతలు తిరగబడ్డారు. శవానికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించని పక్షంలో ఆందోళనకు దిగుతామన్న వారి హెచ్చరికతో రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News