: నేడే ఏపీ రాజధాని ప్రకటన, సర్వత్ర ఉత్కంఠ!
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శాసన సభలో రాజధానికి సంబంధించిన ప్రకటన చేయనున్నారు. మంగళవారమే రాజధానిని ప్రకటించేందుకు సిద్ధమైన చంద్రబాబు, దినం, వర్జ్యం బాగా లేదన్న వేద పండితుల సూచనల నేపథ్యంలో సదరు ప్రకటనను నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే, రాజధానిపై సభలో చర్చ తర్వాతే ప్రకటన చేయాలని ప్రతిపక్షం వాదిస్తున్న నేపథ్యంలో నేటి సభా సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయవాడ, గుంటూరుల మధ్యే రాజధానిని ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటన చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడి సూచనల మేరకు ఆయన అనుచరవర్గం విజయవాడ, గుంటూరుల మధ్య పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసిందని, వారికి ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకు బాబు యత్నిస్తున్నారని సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రాజధానిపై సభలో చర్చ జరిగేదాకా వదిలేది లేదని బుధవారం నాటి సమావేశాల్లో ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రతిపక్షం వాదనను తిప్పికొట్టే వ్యూహాలకూ బాబు బృందం పదును పెడుతున్నట్లు సమాచారం. రాజధాని ప్రకటన సందర్భంగా ప్రతిపక్షం సహకరించని పక్షంలో వారిని సభ నుంచి సస్పెండ్ చేసేందుకూ ప్రభుత్వం వెనుకాడకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం వ్యూహ, ప్రతివ్యూహాల నేపథ్యంలో నేటి సభా సమావేశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.