: స్నేక్ గ్యాంగ్ అకృత్యాలు రెండేళ్ల క్రితం నుంచే పహాడీ షరీఫ్ పోలీస్ అధికారులకు తెలుసు!
స్నేక్ గ్యాంగ్ అకృత్యాలు పహాడీ షరీఫ్ పీఎస్ కు... అక్కడి ఉన్నతాధికారులకు రెండేళ్ల నుంచి తెలుసునని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఆ పీఎస్ లో పనిచేసే కొంతమంది కానిస్టేబుళ్ల సమాచారం ప్రకారం... తమకు ఈ అకృత్యాల గురించి చాలాకాలం నుంచే తెలుసునని... ఈ విషయాల్ని పీఎస్ లో ఉన్నతాధికారులకి రెండు మూడుసార్లు నివేదిస్తే వారు తమను వేధించడం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉన్నతాధికారులకు చెప్పిన విషయం వెంటనే స్నేక్ గ్యాంగ్ సభ్యులకు తెలిసిపోయేదని... ఆ తర్వాత వారు తమ మీద దాడి కూడా చేశారని వారు పేర్కొన్నారు. పాతబస్తీలో బలంగా ఉన్న ఓ రాజకీయ పార్టీ మద్దతు వల్లే స్నేక్ గ్యాంగ్ నిందితులు ఏమాత్రం భయం లేకుండా ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని వారు చెబుతున్నారు. పైసల్ దయానీ స్నేక్ గ్యాంగ్ తో పాటు... ఇలాంటి గ్యాంగ్ లు ఇక్కడ చాలా ఉన్నాయని వారు అంటున్నారు. ఇక స్థానికులు కూడా పహాడీ షరీఫ్ లో పోలీసింగ్ ఏమాత్రం ఉండదని... స్నేక్ గ్యాంగ్ చేసే ఘోరాల గురించి పోలీసులకి చెబితే తమ మీద దాడులు జరిగేవని అంటున్నారు. ఏదో ఒకరోజు వచ్చి పోలీసులు హడావుడి చేసినంత మాత్రాన ఫలితం ఉండదని... ఈ ప్రాంతంలో నిరంతర నిఘా పెట్టాలని వారు కోరుతున్నారు.