: మరణించాడన్న వ్యక్తి రెండు రోజుల తర్వాత బతికొచ్చాడు!
మరణించాడని వైద్యులు ప్రకటించిన ఓ యువకుడు రెండు రోజుల తర్వాత శ్వాస పీలుస్తూ, తాను బతికే ఉన్నానని చెప్పాడు. దీంతో పోలీసులతో పాటు వైద్యులు కూడా నిశ్చేష్టులయ్యారు. ఉత్తరప్రదేశ్ నగరం అలీగఢ్ లో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మధ్య కాలంలో తరచూ వెలుగు చూస్తున్న ఈ తరహా ఘటనల్లో వైద్యుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య పరీక్షల నిర్వహణ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు ఆదరాబాదరాగా ప్రకటనలు చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. అలీగఢ్ లోని ఖేర్ ప్రాంతంలో కెనాల్ పక్కన ఓ యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడన్న సమాచారంతో గత నెల 20న అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గత నెల 29 దాకా అతడికి ఆస్పత్రి వైద్యులు చికిత్స కూడా అందించారు. అయితే 29న అతడు శ్వాస పీల్చడం లేదని గమనించిన వైద్యులు మరిన్ని వైద్య పరీక్షలు చేసిన మీదట, అతడు మరణించాడని నిర్ధారించారు. అనంతరం ఆ యువకుడి మృతదేహాన్ని మార్చురీకి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రి వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రెండు రోజుల తర్వాత తదుపరి చర్యలను పూర్తి చేసేందుకు ఆస్పత్రికి వచ్చారు. శవాన్ని పోస్టుమార్టం కు పంపే ముందు ఆ యువకుడు శ్వాస తీసుకోవడాన్ని పోలీసులు గుర్తించారు. అంతే, ఒక్కసారిగా అందరిలోనూ ఆశ్చర్యం! తీరా తేలిందేమంటే, యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారట. ప్రాణం ఉండగానే మరణించినట్టుగా డిక్లేర్ చేసేశారు. సదరు వైద్యులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సన్నద్ధమవుతున్నారు.