: కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్ పర్సన్ గా కిరణ్ ఖేర్!
ప్రముఖ నటి, ఛండీగడ్ బీజేపీ ఎంపీ అయిన కిరణ్ ఖేర్ ను కేంద్ర చలనచిత్ర సెన్సార్ బోర్డు ఛైర్ పర్సన్ గా నియమించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ నర్తకి లీలాశామ్ సన్ 2011 నుంచి సెన్సార్ బోర్డు ఛైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిసున్నారు. ఈ ఏడాది మొదట్లో ఆమె పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత ఎన్నికల హడావుడిలో పడి అప్పటి యూపీఏ ప్రభుత్వం సెన్సార్ బోర్డు ఛైర్ పర్సన్ తో పాటు సభ్యులను కూడా నియమించలేదు. అప్పటినుంచి సెన్సార్ బోర్డు బాధ్యతలను కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో తాత్కాలికంగా రాకేష్ కుమార్ చూస్తున్నారు. అయితే ఓ నిర్మాత నుంచి లంచం తీసుకున్న కేసులో సీబీఐ ఆయనను ఆగస్టు 18న అరెస్ట్ చేసింది. దీంతో సెన్సార్ బోర్డు ఛైర్ పర్సన్ గా కిరణ్ ఖేర్ ను నియమించాలని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఈమె భర్త... ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ వాజ్పేయి హయాంలో సెన్సార్ బోర్డు ఛైర్ పర్సన్ గా పనిచేశారు.