: మోడీ 'నిఘా' నీడలో వణికిపోతోన్న కేంద్రమంత్రులు


ప్రధానమంత్రి నరేంద్రమోడీ 'నిఘా' నీడలో కేంద్రమంత్రులు వణికిపోతున్నారు. 'నా ఖూవూంగా....నా ఖానేదూంగా' (నేను తినను... ఇంకెవరినీ తిననివ్వను) అని ఆగస్ట్ నెలలో కార్గిల్ పర్యటన సందర్భంగా మోడీ ప్రకటించారు. అవినీతిని పూర్తిస్థాయిలో రూపుమాపుతామని ఇప్పటికే ఆయన పలుమార్లు ప్రకటించారు. అవినీతిరహిత పాలనను ప్రజలకు అందించే క్రమంలో మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు అటు అధికారులను, ఇటు మంత్రులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి నష్టం కలిగించే భారీ అవినీతి కుంభకోణాలు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల అవినీతి వల్లే జరిగాయని మోడీ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే తన మంత్రివర్గ సహచరులపై నమ్మకమున్నప్పటికీ.... మోడీ చాన్స్ తీసుకోదలచుకోలేదని పీఎంవో వర్గాలు అంటున్నాయి. ఏ ఒక్క మంత్రిపై భవిష్యత్తులో ఆరోపణలు వచ్చినా... తన మీద, తన ప్రభుత్వం మీద మచ్చపడినట్టేనని ఆయన భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో, గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రుల పేషీల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని మోడీ నిర్ణయించారు. కేవలం పేషీల్లోనే కాదు...మంత్రుల క్యాబిన్ లలో కూడా సీసీటీవీలు పెట్టేందుకు పీఎంవో వర్గాలు నిర్ణయించుకున్నాయి. ఈ నిర్ణయాన్ని ముందుగా కీలకమైన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి పేషీ నుంచే అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు. అనంతరం దశలవారీగా మిగిలిన మంత్రుల పేషీల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు తమ కార్యాలయాల్లో మాత్రమే కాకుండా... బయట ఏం చేస్తున్నారో కూడా మోడీ టీం ప్రతీ క్షణం ఫాలో అవుతోంది. దీనికి ఉదాహరణగా ఇటీవల ఢిల్లీలో రెండు సంఘటనలు జరిగాయి. ఓ కేంద్ర మంత్రి ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల తర్వాత తన తొలి విదేశీ పర్యటనకు బయలుదేరారు. జీన్స్‌ ప్యాంట్‌, టీషర్టులో టిప్ టాప్ గా రెడీ అయ్యి ఇంటి నుంచి హుషారుగా బయలుదేరి కిలోమీటరు దూరం ప్రయాణించారో లేదో.. మంత్రిగారి ఫోన్‌ మోగింది. ఫోన్‌ ఎత్తిన మంత్రిని అవతలి నుంచి గంభీరమైన స్వరంతో మోడీ పలుకరించారు. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ప్రజాప్రతినిధిగా వేషధారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి ఫోన్‌ కట్‌ చేశారు. విషయం బోధపడిన మంత్రి ఆగమేఘాలపై మళ్లీ ఇంటికి చేరుకుని వేసుకున్న జీన్స్‌, టీషర్టు పక్కన పడేసి... కుర్తా ఫైజమా ధరించి తిరిగి విమానాశ్రయానికి బయలుదేరారు. మంత్రుల కదలికలపై ప్రధాని ఏ స్థాయిలో నిఘా ఉంచారో చెప్పడానికి ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. నిత్యం ఇలాంటి ఉదంతాలు ఢిల్లీలో ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడటంలో కీలకపాత్ర పోషించే మంత్రివర్గ సహచరుల కదలికలను మోడీ నిశితంగా పరిశీలిస్తున్నారు. అదే సమయంలో మంత్రుల ప్రతి కదలికనూ తాను నిశితంగా గమనిస్తున్నానన్న సంకేతాలనూ వారికి పంపుతున్నారు. తద్వారా వారు హద్దులు దాటకుండా చూడటం మోడీ చర్యల ప్రధాన ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని నిఘాకు నిదర్శనంగా నిలిచే మరో ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఓ కేంద్రమంత్రి మోడీకి సన్నిహితుడిగా పేరొందిన బడా పారిశ్రామికవేత్తతో కలిసి ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో విందుకు వెళ్లారు. విందు ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే సదరు మంత్రి ఫోన్‌ మోగింది. ఫోన్‌ ఎత్తిన మంత్రిగారిని మోడీ పలుకరించారు. ‘మీ విందు ముగిసిందా?’ అని వాకబు చేసి మోడీ ఫోన్‌ కట్‌ చేశారు. అంతే... హడావిడిగా విందును ముగించుకున్న మంత్రి వెనువెంటనే పేషీకి చేరుకున్నారు. మోడీ నిఘా ధాటికి భయపడిన మంత్రులు చివరకు తమ ప్రైవేటు సంభాషణల కోసం అధికారిక ఫోన్లను వినియోగించడం మానేశారు. అలాంటి సంభాషణలకు డ్రైవర్లు, ఇతర సహాయకుల ఫోన్లను వాడుకుంటున్నారు. ప్రతిపక్షాల నుంచి గానీ, ప్రజల నుంచి గానీ వేలెత్తి చూపించే అవకాశం ఉన్న ఏ చర్యకు మంత్రులు, ఉన్నతాధికారులు పూనుకున్నా మోడీ వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News