: ఎలాంటి వ్యక్తి... ఎలా అయిపోయారు!
కొన్నేళ్ళ క్రితం విజయ్ మాల్యా అంటే భారతీయుల వ్యాపారదక్షతకు ప్రతీకగా భావించేవారు. మద్యం, విమానయానం వంటి రంగాల్లో ఆయన కంపెనీలు తొలుత భారీగానే లాభాలు ఆర్జించాయి. తదనంతరం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుకోవడంలో విఫలమైన మాల్యా, తన వ్యాపార సామ్రాజ్య పతనానికి తానే కారణమయ్యారు. బ్యాంకుల నుంచి తీసుకున్న వేలాది కోట్ల రూపాయల రుణాలు తీర్చే మార్గాలు కనపడక, మరిన్ని పొరబాట్లు చేశారు. తాజాగా ఆయనపై యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'ఉద్దేశపూర్వక ఎగవేతదారు' అన్న ముద్ర వేయడం మాల్యా బ్రాండ్ తిరోగమనానికి పరాకాష్ఠ. మాల్యాతో పాటు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లోని ముగ్గురు డైరక్టర్లనూ తాము 'ఉద్దేశపూర్వక ఎగవేతదారు'లుగా ప్రకటిస్తున్నామని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ దీపక్ నారంగ్ తెలిపారు. మాల్యా ఎన్నో బ్యాంకులకు భారీ ఎత్తున రుణాలు చెల్లించాల్సి ఉండగా, వాటిలో యూబీఐనే ఆయనపై 'ఎగవేతదారు' ముద్ర వేసింది. మరికొన్ని బ్యాంకులు కూడా మాల్యాపై ఇదే ముద్ర వేసేందుకు కసరత్తులు చేస్తున్నాయి.