: లేడీ రాక్ సింగర్... 'ఐఎస్ఐఎస్' మిలిటెంట్ గా మారింది!
ఆమె ఓ బ్రిటీష్ రాక్ సింగర్... పైగా, ఇద్దరు బిడ్డల తల్లి! ఇప్పుడామె ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గా మారింది. అంతేగాకుండా, తలలు తీస్తామంటూ సిరియా నుంచి క్రైస్తవులకు హెచ్చరికలు జారీచేస్తోంది. ప్రస్తుతం ఆమె పేరు ఉమ్మ్ హుస్సేన్ బ్రిటానీ అని తెలుస్తోంది. వాస్తవానికి ఈమె పేరు శాలీ జోన్స్ అని, కెంట్ లోని చాథమ్ ఆమె స్వస్థలం అని భద్రత సంస్థలు అంటున్నాయి. ఉమ్మ్ తొలుత జునైద్ హుస్సేన్ అనే ఓ బ్రిటీష్ జిహాదీని పెళ్ళాడింది. అంతకుముందు అతగాడు కంప్యూటర్ హ్యాకింగ్ కు పాల్పడేవాడు. ఆన్ లైన్ లో సాగిన వీరి రొమాన్స్ పెళ్ళికి దారితీసింది. అనంతరం వీరు మిలిటెంట్ గ్రూపుల్లో చేరేందుకు వేర్వేరుగా సిరియాకు చేరుకున్నారు. కాగా, జునైద్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్ తాజా రూపం) గ్రూపులో చేరగా, అమెరికా జర్నలిస్టు ఫోలీ ఘటనలో ఇప్పుడతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఫోలీ గొంతు కోసింది ఇతడేనన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.