: ముళ్ళపూడి పోయాక, ఈయన ఎంతోకాలం ఉండరనిపించింది: రాజేంద్రప్రసాద్
బాపు మరణించడంపై నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ప్రియనేస్తం ముళ్ళపూడి వెంకటరమణ చనిపోయాక, బాపు ఎంతోకాలం ఉండరని అనిపించిందని పేర్కొన్నారు. బాపు పాత్రలన్నీ మనకు దగ్గరగా అనిపిస్తాయని తెలిపారు. మహానటుడు ఎన్టీఆర్ కు కూడా బాపుగారంటే ఎంతో ఇష్టమని గుర్తు చేశారు. తెలుగు సినిమాకు రాజేంద్రప్రసాద్ లోని నటుడిని పరిచయం చేసింది బాపు-రమణలేనని చెప్పుకొచ్చారు. ఇంట్లో బిడ్డలానే తనను చూశారని గుర్తు చేసుకున్నారు. కొందరు మనుషులు చనిపోయిన తర్వాత కూడా జీవించే ఉంటారనడానికి బాపు సిసలైన నిదర్శనం అని కీర్తించారు. ఆయన గీసిన బొమ్మలు, తీసిన సినిమాలు ఆయనను సజీవుడిగా నిలుపుతాయని అన్నారు. మాటల రచయిత ముళ్ళపూడితో బాపు ప్రస్థానం చాలా సుదీర్ఘమైనది. వీరిద్దరూ ఎన్నో చిత్రాలకుగాను బాధ్యతలు పంచుకున్నారు. ముళ్ళపూడి చనిపోయేవరకు ఈ జోడీ విడిపోయింది లేదు. చివరికి మరణం మాత్రమే ఇరువురినీ విడదీయగలగడం వారి స్నేహ ఔన్నత్యానికి నిదర్శనం.