: మోడీ వంద రోజుల పాలనపై చర్చోపచర్చలు


ప్రధాని నరేంద్ర మోడీ వంద రోజుల పాలనపై అప్పుడే దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేచింది. ఎన్నికల్లో మోడీ ప్రకటించిన హామీలు, వాటి అమలు, ప్రధానిగా మోడీ వ్యవహార సరళి, విదేశాంగ విధానం తదితరాలపై సర్వత్ర ఆసక్తికర చర్చ సాగుతోంది. వార్తా ఛానెళ్లలో పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక కథనాలు ప్రసారమవుతున్నాయి. మోడీ వంద రోజుల పాలన పూర్తి కావడానికి ఇంకా మూడు రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో ఈ ప్రచారం తార స్థాయికి చేరుకుంది. మోడీ 'అచ్చే దిన్' ఫలితాల ప్రభావం రెండు రోజుల క్రితమే దేశ ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత జీడీపీలో భారీ వృద్ధి నమోదైన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో జన్ ధన్ యోజనలో భాగంగా తొలిరోజే దేశవ్యాప్తంగా కోటిన్నర బ్యాంకు ఖాతాలు ఓపెన్ కావడం కూడా మోడీ ప్రతిష్ఠను మరింత పెంచిందనే చెప్పాలి. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పక్కా ప్రణాళికతో వ్యవహరించిన మోడీ సర్కారు, విపక్షాల నోటికి తాళమేసిన తీరు కూడా ప్రజలను ఆకట్టుకుంది. విదేశాంగ విధానానికి వస్తే, తను పర్యటించిన ప్రతి దేశంలోనూ వినూత్న ఆహ్వానాలను దక్కించుకోవడంతో పాటు, పలు ఒప్పందాలను రాబడుతున్న మోడీ... పాక్, చైనా చొరబాట్ల విషయంలో మాత్రం మెతకగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇక, అగ్రరాజ్యం అమెరికా అయితే మోడీని నెత్తికెత్తుకుంది. అమెరికాలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ప్రసంగించనున్న తొలి భారత ప్రధానిగా ఇప్పటికే మోడీ రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న మోడీ, ఎలాంటి ఫలితాలను మోసుకొస్తారోనన్న విషయంపై దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జపాన్ పర్యటనను ముగించుకుని మోడీ, సరిగ్గా, తన పాలన వంద రోజులు పూర్తి చేసుకునే రోజునే స్వదేశంపై కాలుమోపనున్నారు.

  • Loading...

More Telugu News