: పాకిస్తాన్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం: అల్లర్లలో ఏడుగురు మృతి


పాకిస్తాన్ లో మరోమారు రాజకీయ సంక్షోభం ముదిరింది. దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, రాజధాని ఇస్లామాబాద్ లో వేలాది మంది చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రధాని అధికార నివాసం వద్దకు చొచ్చుకువచ్చిన ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ఆందోళనకారులు కూడా పోలీసులపైకి తిరగబడ్డారు. వీరి దాడుల్లో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దాదాపు 25 వేల మందితో పాక్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీగా ప్రధాని అధికార నివాసానికి చేరుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా రహదారిపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆందోళనకారులు తొలగించారు. దీంతో పోలీసులు తొలుత టియర్ గ్యాస్ గోళాలను ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది. మరోవైపు ఆదివారం ఉదయం వరకూ పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 2013 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిపి నవాజ్ షరీఫ్ విజయం సాధించారని ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఇస్లామిక్ మత గురువు ఖాద్రీ ఆరోపిస్తున్నారు. అక్రమాలకు పాల్పడి దొడ్డిదారిన గద్దెనెక్కిన నవాజ్, తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ, గడచిన 15 రోజులుగా ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శనివారం రాత్రి ఊహించని విధంగా ఆందోళన కారులు చొచ్చుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. అయితే ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నవాజ్ షరీఫ్, రాజధానిని వీడి లాహోర్ కు వెళ్లిపోయారు. ఆందోళనల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్పంచుకున్నారు.

  • Loading...

More Telugu News