: విద్యార్థిని బట్టలిప్పి, ఫొటోలు తీసి... విశ్వభారతి వర్సిటీలో అరాచక పర్వం!
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో తొలిసారిగా అరాచక పర్వం వెలుగు చూసింది. ర్యాగింగ్ పేరిట ఓ విద్యార్థినిని ముగ్గురు సీనియర్ విద్యార్థులు తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేశారు. దీంతో బెదిరిపోయిన సదరు విద్యార్థిని వర్సిటీని వదిలి వెళ్లిపోయింది. ఈ నెల 8న జరిగిన ఈ దారుణంపై 26న వర్సిటీలోని లైంగిక వేధింపుల విభాగానికి ఫిర్యాదు చేసిన సదరు విద్యార్థినికి అక్కడా అవమానమే ఎదురైంది. వివరాల్లోకి వెళితే... వర్సిటీలో ఫస్ట్ ఇయర్ కోర్సులో చేరిన విద్యార్థినిని ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్ పేరిట పిలిచి రూ. 4 వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థిని బట్టలు విప్పి, ఫొటోలు కూడా తీశారు. డబ్బులివ్వకపోతే సదరు ఫొటోలను నెట్ లో పెడతామని బెదిరించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని విద్యార్థిని లోలోపలే కుమిలిపోయింది. ఈ 26న తన తండ్రి వర్సిటీకి రావడంతో ధైర్యం చేసి అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఫిర్యాదును అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. అంతేకాక అరాచకానికి పాల్పడ్డ దుండగులకంటే తామేమీ తీసిపోలేదని, బట్టలు కొనుక్కోమంటూ కొంత నగదును ఆఫర్ చేశారట. దీంతో కంగుతిన్న ఆ తండ్రి తన కూతురును వర్సిటీ నుంచి ఇంటికి తీసుకెళ్లిపోయారు. అయితే దీనిపై పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయొద్దంటూ అధికారులు, విద్యార్థినితో పాటు ఆమె తండ్రికి ఆదేశాలు జారీ చేశారట.