: జపాన్ బయల్దేరిన ప్రధాని మోడీ... వెంట ముఖేష్ అంబానీ, ప్రేమ్ జీ


ఐదు రోజుల పర్యటనకు గాను భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ ఉదయం 6 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. రక్షణ, పౌర, అణు, మౌలిక వసతుల కల్పన, స్మార్ట్ సిటీల వ్యవస్థ, బుల్లెట్ రైళ్లు, ఖనిజ వనరులు, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలే మోడీ పర్యటన ప్రధాన లక్ష్యాలు. పర్యటనలో భాగంగా, తొలుత క్యోటో నగరం చేరుకుని జపాన్ ప్రధాని షింజో అబెతో మోడీ సమావేశమవుతారు. ఈ భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా, పలు రంగాల్లో ప్రబలమైన శక్తిగా ఉన్న జపాన్ సహకారాన్ని భారత్ కోరనుంది. అంతేకాకుండా, బుల్లెట్ రైళ్ల ఏర్పాటుకు సహకారం అందించాల్సిందిగా జపాన్ ప్రధానిని మోడీ కోరనున్నారు. భారత రైల్వేను ఉరకలెత్తించాలనే భావనలో మోడీ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, న్యూక్లియన్ ఎనర్జీ రంగంలో జపాన్ తో ఒప్పందాలకు కూడా మోడీ పెద్దపీట వేయనున్నారు. పౌర అణు వ్యవస్థకు సంబంధించి అమెరికాతో చేసుకున్నట్టే... జపాన్ తో కూడా ఒప్పందాలు చేసుకోవాలనే లక్ష్యం కూడా మోడీ ప్రాధాన్యతా అంశాల్లో ఒకటి. భారత్, జపాన్ రెండు దేశాలకూ చైనాతో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. దీంతో, ఇరు దేశాల ప్రధానులు ఈ విషయంపై లోతుగా చర్చించే అవకాశం ఉంది. జపాన్ పర్యటనలో తొలి సమావేశానికి రాజధాని టోక్యో కాకుండా స్మార్ట్ సిటీగా పేరుగాంచిన క్యోటోను మోడీ ఎంచుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. భారత్ లో 100 స్మార్ట్ సిటీలను నిర్మించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ఉంది. ఇందు కోసం క్యోటోను ప్రధాని మోడీ వ్యక్తిగతంగా పరిశీలించాలని భావిస్తున్నారు. ఈ పర్యటనకు ప్రధాని మోడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలోని పలు రంగాల అభివృద్ధి కోసం జపాన్ తో కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో, భారత బిజినెస్ టైకూన్లు అయిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీలతో పాటు పలువురు టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్టులను కూడా తనతో పాటే జపాన్ తీసుకువెళ్లారు. జపాన్ తో ద్వైపాక్షిక సంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని నిన్న జపాన్ మీడయాతో మాట్లాడిన సందర్భంగా మోడీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News