: కుమార మంగళం బిర్లా అక్రమాలకు పాల్పడలేదు: సీబీఐ


రూ.1.87 లక్షల కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన కోల్ గేట్ కుంభకోణంలో ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమార మంగళం బిర్లా పాత్ర లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తేల్చింది. తద్వారా ఈ కేసులో తాను అత్యుత్సాహం ప్రదర్శించినట్లు ఒప్పుకున్నట్టయింది. కోల్ గేట్ స్కాంలో కుమార మంగళం బిర్లా కూడా పాత్రధారుడేనన్న సీబీఐ ప్రకటనతో గతంలో దేశ పారిశ్రామిక రంగం దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. కుమార మంగళం బిర్లా అక్రమాలకు పాల్పడే అవకాశమే లేదంటూ నాడు దిగ్గజ పారిశ్రామికవేత్తలు సీబీఐ తీరును ఎండగట్టారు. అయినా మొండిగానే ముందుకెళ్లిన సీబీఐ, ఎట్టకేలకు శుక్రవారం నాడు తన తప్పును అంగీకరిస్తూ, బిర్లా పాత్ర లేదని చెప్పింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని హిండాల్కో దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించిన తర్వాత, నాటి బొగ్గు గనుల శాఖ కార్యదర్శి పీసీ పరేఖ్ ను కుమార మంగళం కలిశారని సీబీఐ ఆరోపణ. కుమార మంగళం బిర్లా ప్రభుత్వ అధికారులను కలిసిన నేపథ్యంలో పీసీ పరేఖ్ ఆగమేఘాల మీద బిర్లాకు బొగ్గు గనులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారట. నాడు బొగ్గు గనుల శాఖను తన వద్దే ఉంచేసుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దీనికి తలాడించేశారని సీబీఐ తీర్మానించింది. అయితే, అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని బిర్లాతో పాటు పీసీ పరేఖ్ కూడా వాదించినా సీబీఐ పెడచెవిన పెట్టింది. నాడు బొగ్గు గనుల కోసం దరఖాస్తు చేసుకున్న తొలి సంస్థ తమదేనన్న బలమైన వాదన వినిపించిన బిర్లా ముందు సీబీఐ ఆరోపణలు నిలవలేకపోయాయి. దీంతో సీబీఐ తన వాదనను విరమించుకుంటూ, కోల్ గేట్ లో బిర్లా పాత్రకు సంబంధించి ఆధారాలు లేవంటూ కోర్టుకు విన్నవించింది.

  • Loading...

More Telugu News