: ఏపీ రాజధాని ఎక్కడన్నది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది!
రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎక్కడ నిర్మాణం కానుందన్న అంశం మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. రాజధాని నిర్మాణంపై అధ్యయనం కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. నాలుగు రోజులుగా కమిటీ నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా పలు కథనాలు, భారీ స్థాయి చర్చ జరిగిన విషయం తెలిసిందే. అప్పటికే కేంద్రానికి కమిటీ నివేదిక అందిందని, పలు వివాదస్పద అంశాలు అందులో ఉన్నాయన్న కథనాలపై ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాల్సి వచ్చింది. తాజాగా శుక్రవారం ఎట్టకేలకు కమిటీ 187 పేజీలతో కూడిన తన నివేదికను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అందజేసింది. గుంటూరు-విజయవాడల మధ్య రాజధాని ఏర్పాటును కమిటీ తోసిపుచ్చింది. అక్కడ రాజధాని ఏర్పాటు జరిగితే మరో హైదరాబాద్ తప్పిదమే జరుగుతుందని కమిటీ అభిప్రాయపడినట్టు సమాచారం. అవసరమైన మేరకు ప్రభుత్వ భూములున్న చోటే రాజధాని నిర్మాణం జరగాలని తేల్చిచెప్పింది. రాజధాని కోసం వ్యవసాయ భూములను కొనుగోలు చేయడం అంత మంచిది కాదని సూచించింది. విశాఖలో హైకోర్టు ఏర్పాటుతో పాటు రాయలసీమలో హైకోర్టు బెంచిని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రధానంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కమిటీ నొక్కి చెప్పింది. అంతేకాక ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయడం కూడా వద్దని సూచించింది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపులో హడావుడి పనికి రాదని చెప్పింది. కమిటీ నివేదికను స్వీకరించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, దానిని కేంద్ర కేబినెట్ లో ప్రవేశపెట్టిన తర్వాత ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ఎక్కడ నిర్మాణం కానుందన్న విషయం మరో రెండు, మూడు రోజుల్లో తేలిపోనుంది.