: ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఎత్తు తగ్గనుంది!
ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఎత్తు వచ్చే ఏడాది నుంచి తగ్గనుంది. ప్రతి యేటా ఒక్కో అడుగు పెరుగుతూ భిన్నమైన ఆకృతిలో కనువిందు చేసిన ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం ఎత్తు ఈ ఏడాది 60 అడుగులకు చేరింది. ఇంత ఎత్తైన రూపం ఇదే చివరిసారి కానుంది. వచ్చే సంవత్సరం నుంచి వినాయక విగ్రహం ఎత్తు తగ్గనుంది. ఒక్కో అడుగు తగ్గుతూ అవరోహణ క్రమంలో విఘ్నాధిపతి విగ్రహం రూపుదిద్దుకోనుంది. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతికి శ్రీకైలాస విశ్వరూప మహా గణపతిగా నామకరణం చేశారు. 1954లో ఖైరతాబాదులో గణపతిని తొలిసారి ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 60 ఏళ్లు పూర్తయ్యాయి. అత్యంత ఎత్తులో అవతరించిన బొజ్జ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.