: 'వెల్ కమ్ టు తెలంగాణ' ఆహ్వానాన్ని తిరస్కరించిన ఆంధ్ర ప్రాంత ఐఏఎస్


ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ ను రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణాకు కేటాయించారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావులతో పాటు జేఎస్వీ ప్రసాద్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. విషయం తెలియగానే రాజీవ్ శర్మ 'వెల్ కమ్ టు తెలంగాణ' అంటూ జేఎస్వీ ప్రసాద్ ను ఆహ్వానించారు. రాజీవ్ శర్మ ఆహ్వానాన్ని ప్రసాద్ సున్నితంగా తిరస్కరించారు. అనంతపురానికి చెందిన తాను సొంత రాష్ట్రంలోనే తన సేవలు అందిస్తానని తెలిపారు. తాను ఐఏఎస్ పరీక్షకు హాజరైనప్పుడు అనంతపురంలోనే ఉన్నానని... ఆ వివరాలను కేంద్రం పోగొట్టుకుందని ప్రసాద్ చెప్పారు. ఐఏఎస్ శిక్షణా సమయంలో తన తల్లిదండ్రులు హైదరాబాదులో ఉండడంతో ఆ చిరునామా ఇచ్చానని... దాని ఆధారంగానే తనను ఇప్పుడు తెలంగాణకు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. తాను ఐఏఎస్ రాసినప్పుడు ఇచ్చిన చిరునామా వివరాల ప్రతిని కేంద్రానికి మళ్లీ సమర్పిస్తానని ఆయన తెలిపారు. ఏది ఏమైనప్పటికీ... సొంత రాష్ట్రమైన ఏపీలోనే తాను సేవలందిస్తానని జేఎస్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం జేఎస్వీ ప్రసాద్ ఏపీ పరిశ్రమల ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News