: నా నోటికి అసలే మంచి మాటలు రావు... నేను చెప్పేది జాగ్రత్తగా వినండి!: అసెంబ్లీలో రోజా
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా అధికార పక్షంపై ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మద్యం డోర్ డెలివరీ ఏజెంట్లుగా మారిపోయారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే టీడీపీ కార్యకర్తలు బెల్టు షాపుల్లోంచి మద్యం తీసుకెళ్లి మరీ ఇస్తున్నారని విమర్శించారు. డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం మహిళలను పూర్తిగా మోసం చేసిందని ఆమె అన్నారు. రోజా ప్రసంగం ఆసాంతం టీడీపీ సభ్యులు, మంత్రులు పదే పదే కలుగజేసుకుని అంతరాయాలు కలిగించినప్పటికీ ఆమె దీటుగా సమాధానాలు ఇచ్చారు. ‘నా నోటికి అసలే మంచిమాటలు రావు. నేను మాట్లాడేది జాగ్రత్తగా వినండి’ అని టీడీపీ సభ్యులకు చురక అంటించారు. ఒకానొక సందర్భంలో ఆమె ప్రసంగానికి అడ్డు తగులుతూ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రోజాను 'ఐరన్ లెగ్' అని వ్యాఖ్యానించారు. దాంతో ఐరన్ లెగ్ తనది కాదని, గోపాలకృష్ణారెడ్డిదేనని ఆమె అన్నారు. చంద్రబాబు మీద బాంబుదాడి జరిగినప్పుడు ఆ కారులో బొజ్జలే ఉన్నారని, అలాగే వైఎస్ మరణానికి ముందు రోజు కూడా క్యాంపు కార్యాలయంలో బొకేతో వెళ్లింది ఆయనేనని మండిపడ్డారు. చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి... ఆ తర్వాత ఎన్టీఆర్ కు ఇల్లరికపు అల్లుడిగా మారి... అదే క్రమంలో తెలుగుదేశం పార్టీని ఏకంగా చంకన పెట్టుకుని వెళ్లిపోయారని రోజా విమర్శించారు.