: 'సత్యమేవ జయతే' ప్రెస్ మీట్లో కన్నీళ్ళు పెట్టిన అమీర్ ఖాన్
సూపర్ హిట్ టీవీ షో 'సత్యమేవ జయతే' ప్రస్థానం గురించి వివరిస్తూ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ కార్యక్రమం తొలినాళ్ళ నుంచి నేటి వరకు తాను విన్న దయనీయగాథలు మనసును ఎంతో గాయపరిచాయని పేర్కొన్నాడు. మీడియా ప్రతినిధులకు ఈ మాట చెబుతూ, ఒక్కసారిగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. చొక్కాతో కళ్ళు తుడుచుకుని, ఓ గ్లాసు నీళ్ళు తాగిన తర్వాత తెప్పరిల్లాడు. "టీవీ షో సందర్భంగా సెట్స్ మీదకొచ్చేది కొందరే. కానీ, తెరవెనుక ఎందరి విషాద గాథలో విన్నాను. అవన్నీ తెరమీద చూపడానికి వీల్లేని వాస్తవ గాథలు. చూసి భరించలేరు" అని వివరించాడు. ఇవన్నీ తనపై లోతుగా ప్రభావం చూపాయని, భావోద్వేగాల పరంగా ఈ ప్రస్థానం ఎంతో కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.