: ఆస్తి విషయంలో తల్లితో గొడవపడి రోడ్డునపడ్డ సినీ నటుడు కార్తీక్
80వ దశకంలో సీతాకోకచిలుక, అభినందన, అన్వేషణ, ఘర్షణ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్న తమిళ నటుడు కార్తీక్ రోడ్డున పడ్డాడు. ఆస్తుల పంపకం విషయంలో కుటుంబంలో నెలకొన్న వివాదం ఆయనను ఈ దుస్థితికి తీసుకువచ్చింది. 60, 70 దశకాల్లో తమిళనాట లీడింగ్ హీరోగా వెలుగొందిన ముత్తురామన్ కుమారుడే కార్తీక్. ముత్తురామన్ కు చెన్నై ఆళ్వార్ పేటలో పలు గృహాలు, షాపింగ్ కాంప్లెక్సులు వున్నాయి. వీటికి తోడు ముత్తురామన్ కు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిపాస్తులు కూడా భారీగానే ఉన్నాయి. ముత్తురామన్ 1982లో చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం ఆస్తి వ్యవహారాలను చూసుకుంటోంది. తండ్రి నిర్మించిన ఇంటిలోనే తన తల్లి సులోచనతో పాటు అన్నాచెల్లెళ్ల కుటుంబాలతో కార్తీక్ ఉమ్మడిగా ఇప్పటికీ కలిసి ఉంటున్నాడు. అయితే, కార్తీక్ కు, తల్లి సులోచనకు మధ్య చాలా కాలంగా ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులంతా కలసి కార్తీక్ ను బయటకు గెంటివేసినట్లు సమాచారం. తన తండ్రి ఆస్తి తనకు పంచాలని కార్తీక్ కోరగా... చిల్లిగవ్వ కూడా ఇచ్చే ప్రసక్తి లేదని... వీలునామాలో కూడా అదే ఉందని సులోచన స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో రోడ్డున పడ్డ కార్తీక్ తన స్నేహితులతో కలిసి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యాడు. అయితే, కార్తీక్ కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. ఆస్తిని కార్తీక్ మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తుండడంతో... తల్లి సులోచన ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుందని వారు చెబుతున్నారు. కార్తీక్ పెద్దకుమారుడు గౌతమ్ కార్తీక్ గత ఏడాది మణిరత్నం 'కడల్' చిత్రం ద్వారా హీరోగా తమిళ సినీపరిశ్రమలో అరంగేట్రం చేశాడు.