: ప్రతిష్ఠాత్మక 'జన్ ధన్ యోజన' ప్రారంభం నేడే
భారత ప్రధాని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన' (పీఎంజేడీవై) పథకం నేడు ప్రారంభం కానుంది. ఈ పథకం కింద తొలి రోజే కోటి మంది చేత బ్యాంకు ఖాతాలు తెరిపించడం కోసం ఏర్పాట్లు చేశారు. 2018 నాటికి 7.5 కోట్ల కుటుంబాలకు రెండేసి ఖాతాల చొప్పున అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రధాని మోడీ ఈ పథకాన్ని ఢిల్లీలో ప్రారంభిస్తారు. పీఎంజేడీవై చిహ్నాన్ని ఆవిష్కరిస్తారు. అంతేకాకుండా, సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందే సదుపాయాన్ని జాతికి అంకితం చేస్తారు. హైదరాబాదులో పీఎంజేడీవై కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తోంది. సాయంత్రం 3.30 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో ఈ పథకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆ రాష్ట్ర లీడ్ బ్యాంక్ అయిన ఆంధ్రాబ్యాంకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.