: భారత్-పాక్ ల మధ్య నేడు ఫ్లాగ్ మీటింగ్
భారత భూభాగంపైకి పాకిస్తాన్ యథేచ్ఛగా జరుపుతున్న కాల్పుల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో బుధవారం ఇరు దేశాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరగనుంది. జమ్మూ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖలపై కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ, పాక్ జరిపిన కాల్పుల విషయంపై ఈ సందర్భంగా ఇరుదేశాల క్షేత్ర స్థాయి సైనికాధికారులు చర్చించనున్నారు. తన భూభాగంలోకి అకారణంగా కాల్పులకు దిగుతున్న పాక్ ను నిలువరించేందుకు భారత్ చేయని యత్నం లేదు. అయితే వీటన్నింటినీ పాక్ పెడచెవిన పెట్టిన నేపథ్యంలో ప్రతిదాడులకు దిగిన భారత సైన్యం, తన భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు మిలిటెంట్లను హతమార్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) చర్చల్లో భాగంగా ఈ అంశాన్ని ప్రస్తావించింది. దీంతో ఫ్లాగ్ మీటింగ్ కు ఒప్పుకోక తప్పలేదు. 1971 తర్వాత ఇంత పెద్ద ఎత్తున పాక్ కాల్పులకు దిగడం ఇదే తొలిసారని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పేర్కొంది. దాదాపు 45 రోజులుగా పాక్, భారత్ పైకి కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే.