: ప్రేమ, పెళ్లి అన్నాడు... ముచ్చట తీరాక ముఖం చాటేశాడు
ప్రేమించానంటూ వెంటపడి లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు మాత్రం పది లక్షల కట్నం, భూమి రాసిస్తేనే పెళ్లి అంటున్నాడని ఓ ఏఆర్ కానిస్టేబుల్ పై ఉషారాణి అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయనగరం జిల్లా మక్కువ మండల కేంద్రానికి చెందిన ఉషారాణి విజయనగరంలో కంప్యూటర్ కోర్సు చేస్తుండగా రామభద్రపురం మండలం తారాపురానికి చెందిన తుమరాడ గోవిందతో ఏడాది క్రితం విజయనగరంలో పరిచయమైంది. గతేడాది డిసెంబర్ 8న రైల్వే పరీక్ష రాసేందుకు విశాఖ వెళ్లగా తనతో పాటు వచ్చిన గోవింద్ విజయనగరంలో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తనను లొంగదీసుకున్నాడని ఆరోపించింది. జూన్ 22న తమకు నిశ్చితార్థం జరిగిందని... ఆ సందర్భంలో లక్ష రూపాయలు తన తల్లిదండ్రులు ముట్టజెప్పారని ఆమె చెప్పారు. అనంతరం తనకీ పెళ్లి ఇష్టం లేదని, తనకంటే అందమైన, కట్నం ఎక్కువ తెచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడని ఆరోపించింది. ఇప్పుడు 10 లక్షల రూపాయలు, తన పేరున ఉన్న భూమి ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని గోవింద స్పష్టం చేస్తున్నాడని, అతనిపై కేసు నమోదు చేయకుండా పెళ్లి చేయాలని ఆమె అభ్యర్థిస్తున్నారు. దీంతో సాలూరు సీఐ దేముళ్లు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.